వృద్ధుడికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’
చిత్రం న్యూస్, వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమావధిగా పెట్టుకున్న ‘సనాతన హిందూ సేవా సమితి’ తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో 177వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఖిలా వరంగల్ మధ్య కోట ప్రాంతానికి చెందిన చింత కొమురయ్య గౌడ్ అనే వృద్ధుడు వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అతనికి ఎటువంటి ఆధారం లేదని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు తక్షణమే స్పందించారు. కొమురయ్య గౌడ్‌కు రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు బడుగు రాము, తాళ్లపెల్లి రమేష్, పెరుమాండ్ల శ్రవణ్, మేరుగు కరుణాకర్, బండారి సంపత్, పేర్ణ భరత్, ఆవునూరి రాజేష్, గజ్జెల రాము తదితరులు పాల్గొన్నారు. సమితి చేస్తున్న ఈ కృషిని స్థానికులు కొనియాడారు.

