ATEXCON-2026 సదస్సులో పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
చిత్రం న్యూస్, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని కల్పించేందుకు పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) సంయుక్తంగా నిర్వహించిన 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON-2026)లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ATEXCON-2026 నివేదికను విడుదల చేశారు. సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను సీఎం మంత్రులతో కలిసి సందర్శించారు. సదస్సులో మాట్లాడుతూ.. “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్ రంగాన్ని పరిపుష్టం చేశాయి” అని అన్నారు. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. “టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో భాగం” అని పేర్కొన్నారు.
తెలంగాణలో పత్తి ఉత్పత్తి, నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటి సంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని వివరించారు. టెక్స్‌టైల్ రంగం రాష్ట్రంలో పరిశ్రమ మాత్రమే కాకుండా ప్రజల జీవనాధారమని అన్నారు.
వరంగల్‌లో ప్రపంచ స్థాయి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి, అనేక అప్పరెల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని, అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “తెలంగాణలోని పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ ర్యాంప్‌ల వరకు అనుసంధానం కావాలి” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్‌గా ఎదుగుతోందని, ఇటీవల నెట్‌ఫ్లిక్స్ స్టూడియోలను ప్రారంభించినట్లు తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ కూడా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటోందని, సినిమా రంగానికి అనుబంధంగా ఫ్యాషన్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో డిజైన్, కట్టింగ్, స్టిచింగ్ రంగాల్లో యువతకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
“ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయడం మా లక్ష్యం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు


