చిత్రం న్యూస్, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ కింద కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖాళీ స్థలాలున్న చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించాలని యోచిస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద లక్షకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో, గృహనిర్మాణ శాఖ అధికారులు ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.ఈ అపార్ట్మెంట్లు స్టిల్ట్+9, స్టిల్ట్+5, మరియు జీ+3 అంతస్తుల వరకు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి యూనిట్ సుమారు 415-500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు పడకల గదులతో నిర్మించబడనుంది. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ అపార్ట్మెంట్ల నిర్మాణంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, రాష్ట్రంలో గృహనిర్మాణ రంగంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది


