చిత్రం న్యూస్, బైంసా : భైంసా పట్టణంలో డాక్టర్ కాశీనాథ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మమతా క్లినిక్ ఆసుపత్రిని ముథోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భైంసా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వైద్య సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. మమతా క్లినిక్ వంటి సంస్థలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ప్రజల ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ, మమతా క్లినిక్ ద్వారా ప్రజలకు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వివిధ రకాల వ్యాధులకు చికిత్సతో పాటు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రముఖులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
చిత్రం న్యూస్, నిర్మల్ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.48 గంటల ధర్నాలో భాగంగా నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ ఎండాకాలంలో రోడ్డు వేడితో ఉన్న ఆశా వర్కర్లు రోడ్డుపై భైఠాయించారు గంటపాటు ధర్నా చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని వెంటనే వారి సమస్యలను పరిష్కరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రూ. 26వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు 18 వేలు కచ్చిత వేతనాన్ని ప్రకటించాలన్నారు. సమాజంలో ఆశా వర్కర్ల పాత్ర గణనీయమైనదని కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని, పని భద్రత కల్పిస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ హామీలను మర్చిపోయిందన్నారు.వెంటనే ఇచ్చిన హామీలపై నిలబడి పరిష్కారం చేయాలని, లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశాలకు మద్దతుగా అంగన్వాడీ యూనియన్ మద్దతు తెలిపారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శైలజ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, కార్యదర్శులు పీ.గంగామణి, ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ, ఇంద్రమ్మ, నంద,సుగ్న,పద్మ, సహాయ కార్యదర్శులు, కమల, రామలక్ష్మి మంగ, శ్యామల, సులోచన, అనసూయ, జ్యోతి, వినోద తదితరులు పాల్గొన్నారు
ముథోల్‌లో బేస్‌మెంట్ దశలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం
*టీఆర్‌పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ మండిపాటు
నిర్మల్ జిల్లా:- ముథోల్:మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఐదేళ్లుగా బేస్‌మెంట్ దశలోనే నిలిచిపోవడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…2022లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తికాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పనులను పట్టించుకోకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు ఫాలోఅప్ చేయడంలో విఫలమవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందని ఆరోపించారు.
ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న పాత ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి సేవలు కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయి? నిధుల మళ్లింపు జరిగిందా? అనే అంశాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జెడ్లోడ్ శంకర్, టీఆర్‌పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తండ్రి కారు టైరు కింద పడి 16నెలల పసికందు మృతి
చిత్రం న్యూస్, బైంసా: అప్పటివరకు కుటుంబసభ్యులతో ఆ చిట్టి తల్లి చిరునవ్వులు చిందించింది. అంతలోనే విధి వక్రీకరించిందేమో తండ్రి కారు టైరు కింద పడి 16నెలల పసికందు మృతిచెందిన ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన బాలేరావ్ అవదుత్ – సుష్మ గత కొంతకాలంగా వలస నిమిత్తం నార్కట్ పల్లి వెళ్లారు. కాగా బంధువుల పెళ్లి కోసం తన ఇద్దరు కుమారైలతో స్వగ్రామం బోరేగాం వచ్చారు. సోమవారం ఇంటి దగ్గర ఉన్న కారును చెట్టు కింద నీడలో పెట్టేందుకు రివర్స్ తీసే క్రమంలో గమనించని తండ్రి తప్పిదం వల్ల తన 16 నెలల కూతురు శ్రీయంశి టైర్ కింద పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన తండ్రి వెంటనే భైంసా ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కుటుంబీకులు బంధువులను చిదిమి వేసింది. చిన్నారి మృతిపట్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జుబేర్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
చిత్రం న్యూస్, ఉట్నూర్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ మృతి పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. అజ్మీర గోవింద్ నాయక్ ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన ప్రజానాయకుడని కొనియాడారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. గోవింద్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నిర్మల్ బుద్ధ విహార్ లో కొనసాగుతున్న భీమ్ దీక్ష, జ్ఞాన దీక్షలు
చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ బుద్ధ విహార్ లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ భీమ్ దీక్ష జ్ఞాన దీక్షలు రెండో రోజు కొనసాగాయి.ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి పంచశీల ప్రార్థన చేశారు. ఇద్దరు ఉపాసకులు. గొల్లపేట్ కు చెందిన సింగరి జగదీశ్వర్, చించోలి (బి) గ్రామానికి చెందిన గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మట్ట గంగాధర్ లు భీమ్ దీక్ష జ్ఞాన దీక్షలను స్వీకరించారు. తెల్లని దుస్తులు, నీలి కండువాలు ధరించారు. మహనీయుడు కాన్షిరాం జయంతి రోజు ప్రారంభమైన ఈ దీక్షలు డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగనున్నాయి. ఇంకా ఎవరైన దీక్ష స్వీకరించదలిచిన వారు మధ్యలో ఎప్పుడైన స్వీకరించ వచ్చు అని అన్నారు. అనంతరం. రావుల గంగన్న గ్రంథ పఠనం చేశారు . స్వీట్లు, పండ్లు, పులిహోర, పాయసం పంపిణీ చేశారు . వందన సమర్పణతో ముగించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కొంతం మురళీధర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్, భగత్ నారాయణ, జాడే సంజీవ్, మధుకర్ గైక్వాడ్, సంఘర్ష్ గైక్వాడ్, ఉపాసిక కొంతం ఆమ్రపాలిలు తదితరులు పాల్గొన్నారు.
బాసర అతిథి భవనంలో స్వచ్ఛభారత్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర డార్మెంటరీ అతిథిభవనంలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఏఈఓ గంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 మంది వాగ్దేవి సొసైటీ సిబ్బంది,హుడా సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతిథి గృహంలోని బాత్రూం టాయిలెట్స్ లలో యాసిడ్, ఫినాయిల్ తో క్లీన్ చేయించారు. స్నానపు గదులతో పాటు హాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రపరిచారు. భక్తులు సద్వినియోగం చేసుకునే ప్రతి ఒక్క రూమును నీటితో శుభ్రపరిచారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏఈఓ గంగా శ్రీనివాస్ కోరారు.
ఆర్జీయూకేటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకంపై విద్యార్థుల నిరసన
చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నియామకంపై దుమారం రేగుతోంది. సోమవారం ఈ అంశంపై తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్‌ను కలిసి చర్చించారు. మొదట వైస్ ఛాన్సలర్‌ను కలిసేందుకు కేవలం ఐదుగురు విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలపడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు అధికారులు వెనక్కి తగ్గి అనుమతించడంతో, సుమారు 30 మంది విద్యార్థులు వీసీ గదిలోకి వెళ్లి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.TSAS వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజ్మల్ ఖాన్ నేతృత్వంలో విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఉన్న ఇ.మురళీ దర్శన్ ని ఏ ప్రాతిపదికన ‘అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్’గా నియమించారని విద్యార్థులు ప్రశ్నించారు.ఈ పోస్టుకు సంబంధించి ఎటువంటి పబ్లిక్ నోటిఫికేషన్ , పారదర్శక నియామక ప్రక్రియ చేపట్టకపోవడాన్ని తప్పుబట్టారు. సదరు అధికారి విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను నేరస్థులలా చూస్తున్నారని, దీనివల్ల క్యాంపస్‌లో భయానక వాతావరణం నెలకొందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామక ఉత్తర్వులను తక్షణమే బహిర్గతం చేయాలని, విద్యార్థులపై జరిగిన వేధింపులపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ నియామకంలో నిబంధనలు పాటించకపోతే మురళీ దర్శన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘం స్పష్టం చేసింది.
భీంసరిలో ఘనంగా గృహప్రవేశం: హాజరైన మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్:ఆదిలాబాద్ నియోజకవర్గంలోని భీంసరి గ్రామంలో పోతారాజు శోభ-అశోక్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీంసరి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు బిక్కి గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులను ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిక్కి గంగాధర్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని కొనియాడారు. పూరిగుడిసెల్లో మగ్గుతున్న వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తున్న మహోన్నత వ్యక్తి మన ముఖ్యమంత్రి అని, అలాగే నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.నూతన ఇంటిలో ఆ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భీంసరి కాంగ్రెస్ లీడర్ నాగార్తు అంబదాస్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేయాలి
చిత్రం న్యూస్, అదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా టీఎన్జీవోస్ సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పీవో ను టీఎన్జీవోస్ జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీఎన్జీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. తిరుమల్ రెడ్డి, జిల్లా బాధ్యులు జి.గోపి, రాజేశ్వర్, నారాయణ, రవి , ఓం ప్రసాద్, రూరల్ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి అరుణ్, వార్డెన్ సంఘం అధ్యక్షుడు నర్సింలు, గోవిందు, శ్రీనివాస్, నవీన్, సంజీవ్, సాయి కుమార్, విజయ్ , సంజయ్, టీఎన్జీవో యూనియన్ మాజీ అధ్యక్షులు సంద అశోక్, మహిళా బాధ్యులు, వందన, సుజాత, రాధ, సంగీత, ఆశ జ్యోతి వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
