*కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామన్న ఉప సర్పంచ్ సాగర్
చిత్రం న్యూస్ బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో ఐటీడిఏ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం కోసం ప్రభుత్వం రూ. 2.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆదిలాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ పనులను దక్కించుకొని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పునాది, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో పిల్లర్ల పెచ్చులు ఊడిపోతున్నాయి. గ్రామ సర్పంచ్ దౌలత్ మేస్రం, ఉప సర్పంచ్ సాగర్ స్థానికులతో కలిసి సంబంధిత పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ మాట్లాడుతూ. గిరిజన బాలుర వసతి గృహం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. పనులను పర్యవేక్షించే ఐటీడీఏ అధికార యంత్రాంగం నిఘా సైతం పూర్తిగా కొరవడడంతో కాంట్రాక్టర్ తనకు నచ్చినట్లు పనులు నిర్వహిస్తున్నాడు అని ఆందోళన వ్యక్తం చేశారు.బిల్డింగ్ సంబందించిన నాసిరకం పనులు గురించి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికి ఇప్పటివరకు సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడం లేదన్నారు. నిర్మాణ పనులు నాసిరకం ఉంటే తరువాత ఏదైనా జరిగితే దీనికి బాధ్యులు ఎవరని విచారం వ్యక్తం చేశారు. ఈ పనుల గురించి జిల్లా కలెక్టర్ కు సర్పంచ్ తో కలిసి పిర్యాదు చేస్తామన్నారు.


