కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, భైంసా: రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ అని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ ప్రవేశ పెట్టిందే బీజేపీ (BJP) ప్రభుత్వమని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణలో కూడా తెల్లరేషన్ కార్డు కల్గిన ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల బియ్యం మూడు సంవత్సరాల నుంచి ఉచితంగా అందిస్తోంది నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమన్నారు. రేషన్ బియ్యం కోసం కిలోకు రూ.40 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వక పోవడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. నా హయాంలో నియోజకవర్గంలో 17 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.

