ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విలీన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరువలేని రోజని, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సామాజిక న్యాయం లభించాయని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ సంతోష్ రావు, టౌన్ ప్రెసిడెంట్ కిజార్ పాషా, మహిళా నాయకురాలు అన్నపూర్ణ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
