బేలలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్,బేల: రైతులకు మద్దతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆధ్వర్యంలో బేలలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్లో జొన్నలకు ఆశించిన ధర లభించక రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా రైతుల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నానని స్పష్టం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను ఇప్పటికే పదిసార్లు మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.
గోదాముల కొరతపై మహారాష్ట్ర మంత్రులతోచర్చలు: గత ఏడాది వచ్చిన పంటలతో పాటు, ప్రస్తుతం ఉన్న మొక్కజొన్న, శనగ నిల్వల కారణంగా తెలంగాణతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గోదాములు పూర్తిగా నిండిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిల్వల సమస్యను అధిగమించడానికి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో గోదాముల లభ్యతను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై తాను స్వయంగా మహారాష్ట్ర మంత్రులతో మాట్లాడినట్లు వెల్లడించారు.
రైతులకు కీలక సూచన: కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి జొన్నలను తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి అక్రమాలకు స్థానిక రైతులు ఎవరూ సహకరించవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపి నాయకులు ఇంద్రశేఖర్,నందు,రాకేష్,రాజు, బీఆర్ఎస్ నాయకులు దేవన్న, ప్రమోద్ రెడ్డి, తేజరావ్, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

