బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ..బాల్య వివాహం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ దురాచారాన్ని అరికట్టడం మనందరి బాధ్యతని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. “ఆడపిల్లల చదువు మధ్యలో ఆగకూడదు. చిన్న వయసులో పెళ్లి వద్దు – వారి పెద్ద కలలకు ఊపిరి పోద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్ సునీత పాల్గొని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో ఇకపై ఎలాంటి బాల్య వివాహాలు జరగనివ్వమని ఈ సందర్భంగా గ్రామస్థులందరూ కలిసి నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దినేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

