స్వీయ గణన పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన (Self-Enumeration) పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
స్వీయ గణన పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల ప్రజల విలువైన సమయం ఆదా అవుతుందని, వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సామాన్య ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ద్వారా ఎవరికి వారు తమ వివరాలను స్వయంగా వెబ్‌సైట్‌లో పొందుపరచవచ్చని ఆయన వివరించారు.
జనగణన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.




