నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ బృందాలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని టాస్క్‌ఫోర్స్ బృందాలను ఆదేశించారు. లైసెన్స్ లేని విత్తనాలను విక్రయించినా, అనుమతి లేని కంపెనీల విత్తనాలు విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..జిల్లాలో అక్రమ విత్తన రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ జగదీశ్వర్ రావ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ బృంద సభ్యులు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.




