చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోనీ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మల్లిపూడు తేజస్వని మృతికి యూనివర్సిటీ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ ఆరోపించారు. విద్యార్థినికి సకాలంలో సరైన వైద్యం అందించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు.అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలనే స్పృహ కూడా వీసీకి లేదని, టెక్నికల్ అంశాలపైనే దృష్టి సారించి, విద్యార్థి ప్రాణాలను బలిగొన్నారని రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.వ్యక్తిగత లబ్ధి, డబ్బు సంపాదన పక్కన పెట్టి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలని, మెరుగైన వైద్య పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.
ప్రయోజనం పొందాలనే ఆశతో బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చిన విద్యార్థులు శవాలుగా తిరిగి వెళ్లడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. మరణించిన విద్యార్థిని మల్లిపూడు తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీని నడిపే సామర్థ్యం లేకపోతే వీసీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. మెస్ కాంట్రాక్టులు తీసుకున్న వారికి రక్షణ కల్పించే వీసీ, విద్యార్థుల ప్రాణాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ముసుగు తొలగించి, బాసర ట్రిపుల్ ఐటీని కాపాడుకుంటామని ఆయన హెచ్చరించారు.

