నాగభూషణం స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని నాగభూషణం స్కూల్లో కార్గిల్ విజయ్ దివస్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మన మాతృభూమి కోసం పోరాడి, శాంతి భద్రతలను కాపాడిన వీరులను గుర్తుంచుకుందాం అంటూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్. ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ ను ఎందుకు జరుపుకుంటారు..?
కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకునే ఒక జాతీయ పండగ. 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించింది. ఈ యుద్ధంలో అమరవీరులైన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ధైర్యం, పరాక్రమాన్ని గౌరవిస్తూ ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్ని కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. 1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతి ఏటా జూలై 26ను కార్గిల్ విజయ దినోత్సవంగా జరుపుకుంటాం.

