అమరవీరుల స్థూపం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా..
*కలెక్టర్ కు వివరించిన బాలూరి గోవర్ధన్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం నిర్మాణం పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆరా తీశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శనివారం అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం ఎప్పుడు నిర్మించారని స్థానికులను అడగగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 లో మంగళ్ పాండే నాటి భారతీయ తిరుగుబాటు కు జ్ఞాపకార్ధంగా ఈ స్థూపం నిర్మించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ కు వివరించారు. ఈ స్థూపం నిర్మాణానికి ఆదిలాబాద్ సమీపంలోని భీంసరి గ్రామ వాగులో లభించే ఎర్రటి రాతి తో నిర్మించడం జరిగిందని తెలిపారు. 1999 లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాకిస్తాన్ పై విజయం సాధించినందుకు గాను తొలిసారిగా ఇక్కడే వేడుకలు జరుపుకున్నామని పేర్కొన్నారు. ఆనాటి మున్సిపల్ చైర్మన్ దివంగత లాలా రాధేశ్యామ్ పాలకవర్గం 2000 సంవత్సరం లో స్థూపానికి మరమ్మతులు చేయించి ఈ పార్క్ కు కార్గిల్ పార్కుగా నామకరణం చేశారన్నారు. కార్గిల్ యుద్ధం సమయములో తమ స్పందన స్వచ్ఛంద సంస్థ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బిపిన్ పటేల్, హార్పల్ సింగ్, పార్థసారథి లము రూ.50 వేలు సేకరించి ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించామని కలెక్టర్ కు తెలిపారు.

