చిత్రం న్యూస్, ఆదిలాబాద్: “చట్టాన్ని తెలుసుకుందాం – బాల్యాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో ”సురక్షిత బచ్పన్ అభియాన్” ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల సరస్వతి నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.హుస్సేన్ బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై జరిగే వేధింపుల నివారణ, విద్యా హక్కు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలబాలికకు సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాలలపై జరిగే అన్యాయాలు, వేధింపులు, హక్కుల ఉల్లంఘనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగించే ఘటనలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి, చట్టపరమైన సహాయం పొందాలని తెలిపారు.చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా బాలల హక్కులను కాపాడటంతో పాటు, వారిపై జరిగే అన్యాయాలను నివారించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, పాఠశాల సిబ్బంది, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.