చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 67 మంది లబ్ధిదారులకు రూ.18.90 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: ఆదిలాబాద్ ప్రజలు మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని యవత్మాల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక రిమ్స్ (RIMS) ఆస్పత్రిలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల వినియోగం మరియు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల విడుదలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడే వారికి CMRF ఒక వరమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మయూర్, ఆకుల ప్రవీణ్, దోని జ్యోతి, సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

