Home Blog Page 64

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, వివేక్ 

0

చిత్రం న్యూస్, బజార్ హత్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనే ఈ భారీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన మంత్రుల బృందానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఘనస్వాగతం పలికారు.

హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులకు కంది శ్రీనివాస రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి ఆయన సభాస్థలిని, పార్కింగ్ ఏర్పాట్లను  ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి 

0

*అంతర్జాతీయ క్రీడాకారులు గూగులోత్ సౌమ్య, హుస్సాముద్దీన్ లకు ఘనంగా సత్కారం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : సరిపడా సౌకర్యాలు లేనప్పటికీ క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు ముందుకుసాగాలని, నిజామాబాద్ జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్ – 2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యలు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్ లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

సీ.ఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్ లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అధ్బుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని అన్నారు. విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీ.ఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభను చాటేలా విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్ లను, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డివైఎస్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించాలి 

0

చిత్రం న్యూస్, తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని,  వెంటనే పునరుద్దరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ మాదిగ సాటే కాలనీలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు. తానూర్ ఎంపీడీఓ, నిర్మల్ జిల్లా డీఎల్పీఓలు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

అదేవిధంగా మిషన్ భగీరథ పనుల సందర్భంగా సీసీ రోడ్, బ్రిడ్జ్ తవ్వి పైప్‌లైన్ వేసి అలాగే వదిలేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, రాత్రి సమయంలో గుంతలు కనిపించక పలువురు అందులో పడిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తవ్విన రహదారులను మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, నిజామాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభావశీలిగా నిలిచారని కొనియాడారు. ఆనాటి దేశముఖ్ ల అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం జరిపారని గుర్తు చేశారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో తెలంగాణాలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలు జరిగాయని, ఈ ఉద్యమాలకు దొడ్డి కొమురయ్య పోరు పటిమ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహనీయుల కృషిని స్మరించుకునేందుకు, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఉద్బోధించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల నాయకులు లక్ష్మణ్, దేవన్న, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, నరాల సుధాకర్, రాజేశ్వర్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

0

చిత్రం న్యూస్, నిజామాబాద్: మీ సేవ ఆపరేటర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ చార్టర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.ఈ మేరకు జిల్లా మీ సేవ యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంఓసిఏ, ఏఎంసిఓఏ గత సంవత్సరం 2025 లో జేఏసీగా ఏర్పడ్డాయి.గత పది సంవత్సరాలుగా జిల్లా యూనియన్ సభ్యులు కలిసి కమీషన్ పెంపు కోసం కమిషనర్, ఐటీ సెక్రటరీ, ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించి,మీ సేవ సేవలపై కమీషన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీ సేవ కమిషనర్ రవి కిరణ్‌లకు జిల్లా యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పెరిగిన కమీషన్  ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అదే రోజు నుంచి కొత్త సిటిజన్ చార్టర్ కూడా అమలులోకి వచ్చింది.ఏప్రిల్ 3 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 5 ఉదయం 8 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల సేవల్లో అంతరాయం ఉంటుందని ప్రజలు గమనించి సహకరించాలని యూనియన్ నాయకులు కోరారు.  ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి కమీషన్ పెంచడం సంతోషకరం. భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ  ఏఎంసిఓఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టి ఎంఓఏ జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులుపెద్దోళ్ళ కిషోర్, ధర్మానందం, జివిఆర్, శివకుమార్,విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, పి.శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) దేవాలయ నిర్మాణానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భారతదేశంలో హిందువులుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమని, ఇది ఎంతో అదృష్టకరమని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, అశాంతితో అల్లాడుతుంటే, భారతదేశం నేడు అత్యంత సురక్షితంగా, శాంతియుతంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రభూవానంద ప్రభుజీ సేవలు అమోఘం:

ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రభూవానంద ప్రభుజీ నాయకత్వంలో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మికతను విశేషంగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుజీ తన ప్రసంగాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ, ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఇస్కాన్ ఆలయ నిర్మాణం ద్వారా జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండారి దేవన్న, తాటిపల్లి రాజు, ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలు

0

చిత్రం న్యూస్, ఖమ్మం: దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ఖమ్మం లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి బహుజన జేఏసీ బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డా. కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరయ్య తెలంగాణ రైతాంగ పోరాటంలో విరోచిత పోరాటం చేసి భూమి, భుక్తి, జాతి విముక్తి కోసం పోరాడి అమరుడైన తొలి తెలంగాణ అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. వారి ఆశయాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు కూరాకుల నాగభూషణం యాదవ్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పెరుగు వెంకటరమణ యాదవ్, కత్తి నెహ్రూ గౌడ్, కుర్మ గొల్ల అధ్యక్షులు మల్లేశం యాదవ్, రాజ్యాంగ పరిరక్షణ స మితి వ్యవస్థాపకులు సాదిక్ అలీ, సావిత్రిబాయి పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపకులు పెళ్లూరి విజయకుమార్, లంబాడ హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అధ్యక్షులు శోభన్ నాయక్, కోడి లింగయ్య యాదవ్ నరసింహారావు, మధు, తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఆరాధనలు

0

చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని CSI వెస్లీ చర్చి వెంకటాపూర్ తో పాటుగా ఇతర చర్చిలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ఉదయం నుంచే విశ్వాసులు చర్చిలకు చేరుకొని ప్రార్థనలు, కీర్తనలు చేశారు. శిలువ మార్గం ఆచరణతో పాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తులు ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యారు.

ఈ ఆరాధనలో Rev. S. వరప్రసాద రావు దైవ సందేశం అందించారు. క్రీస్తు శిలువపై చేసిన త్యాగం మనుషుల పాపక్షమకు మార్గమని, ప్రేమ, క్షమ, త్యాగం జీవన విధానంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలో క్రీస్తు శిలువపై చివరి ఏడు మాటలపై బోధనలు నిర్వహించారు. విశ్వాసులు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తూ భక్తి భావాన్ని వ్యక్తం చేశారు.

బోర్డు తిప్పిన మిర్చి వ్యాపారి:రూ.5 కోట్లకు ఎగనామం !

0

చిత్రం న్యూస్, వరంగల్ : వరంగల్ లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ.5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో ఓ ట్రేడర్స్ పేరిట ఓ వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా ఆయన మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ క్రమంలో ఆయన డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆ వ్యక్తి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా..విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ వ్యాపారి ఐదేళ్ల క్రితం జమ్మికుంటలో కూడా మోసం చేసి ఐపీ పెట్టీ ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడినుండి వరంగల్ కు వచ్చిన అతను ఓ ట్రేడర్స్ తో వ్యాపారం కొనసాగించాడు. అడ్తీ వ్యాపారులను మచ్చిగ చేసుకున్నాడు. అడ్తీ దారుల వద్ద భారీగా మిర్చిని కొనుగోలు చేసి ఇక్కడే అమ్ముకొని సొమ్ము చేసుకొని పక్క ప్లాన్ తో పారిపోయినట్లు తెలుస్తోంది.

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

0

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయానికి రానున్న నేపథ్యంలో, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, శంకుస్థాపన జరిగే ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.