చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె. రామ్ చందర్ రావ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ లు మాట్లాడుతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ చిన్నప్పటి నుండే కుల వివక్షను, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు . విద్య ద్వారానే మార్పు సాధ్యమని , అంటరానితనాన్ని నిర్మూలించడానికి అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించడానికి ఆయన 1935లో అఖిలభారత అనగారిన వర్గాల లీగ్ ను స్థాపించారన్నారు. ఒక దేశంలోని బలహీన పౌరులకు సాధికారత కల్పించే వరకు ఆ దేశం నిజంగా స్వేచ్ఛగా ఉండలేదని ఆయన విశ్వసించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితం దేశానికి ఒక అనిర్వచనీయమమైన స్తంభంగా నిలిచిందాన్నారు.భారత రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఉప ప్రధానిగా ఆయన పరిపాలన నైపుణ్యం, భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిందన్నారు. హరిత విప్లవంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పోషించిన పాత్ర దేశ సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అని , నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంల నిలిచిన ఆయన జీవితం మనందరికీ స్ఫూరిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ (వెల్ఫేర్, హోంగార్స్), రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ ( ట్రాఫిక్ ), స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు సంతోష్ రెడ్డి , సాయన్న , సిసిఅర్బీ ఎస్ఐలు శివరాం, విజయ్ కుమార్, పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కరంజి-కె లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, జైనథ్: మహోన్నత సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కరంజి-కె గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గొంటిముక్కుల శైలజ పొచ్చన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలజ పొచ్చన్న బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయవేత్తగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించి, పేద ప్రజల హక్కుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు.
వెంకుర్‌లో మొక్కజొన్న సంచుల దొంగతనం
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకుర్ గ్రామంలో రైతు మగ్గిడి నారాయణకు చెందిన మొక్కజొన్న సంచులు రాత్రి దొంగతనానికి గురయ్యాయి. రోడ్డు పక్కన భద్రపరిచిన సంచులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోవడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశారు.వెంకుర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి నారాయణ, తన పొలంలో పండించిన మొక్కజొన్నను సంచుల్లో నింపి, గ్రామంలోని రోడ్డు పక్కన ఉంచారు. అయితే, రాత్రి సమయంలో దుండగులు ఈ సంచులను దొంగిలించి తీసుకెళ్లారు. ఉదయం సంచులు కనిపించకపోవడంతో రైతు నారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై వెంటనే సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు.
నిర్మల్‌లో లో పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం
చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ ల పర్యటన సందర్భంగా భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీతో పట్టణం మార్మోగింది. నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గణనీయమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ పర్యటన సందర్భంగా, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాయకులకు తమ మద్దతును తెలిపారు. అనంతరం, భారీ బైక్ ర్యాలీని నిర్వహించి, సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం ద్వారా నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలం స్పష్టంగా కనిపించిందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ ల పర్యటన, పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
బాసర అమ్మవారి సన్నిధిలో ఆర్జిత సేవలు రద్దు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో రూ. 225 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: మేయర్ ఉమారాణి రమేష్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ శనివారం ఆలీ సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. నీటి మట్టాలు, నిల్వ సామర్థ్యం, ప్రజలకు తాగునీటి సరఫరా అంశాలపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఇటీవల అక్కడ జరిగిన దొంగతనం ఘటనపై కూడా మేయర్ చర్చించారు. ఆ ఘటన ఎలా జరిగిందో పూర్తిగా వివరాలు తెలుసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం అన్నారు.
ప్రతి అమ్మాయి క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి అమ్మాయి క్యాన్సర్ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార గోడ ప్రతులను శనివారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 నుంచి 26 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేస్తుందన్నారు. దీనికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ మద్దతుగా నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ ఎంతో తోడ్పడుతుందన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చొరవ తీసుకొని అవగాహన కల్పించడం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల సురేష్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, దీపక్, మహేష్, కృష్ణ, కార్తీక్, గోపి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట గ్రంథాలయానికి జనతా ట్రస్ట్ చేయూత – విద్యార్థుల సౌకర్యార్థం ఫర్నిచర్ పంపిణీ
చిత్రం న్యూస్,నర్సంపేట: ప్రభుత్వ గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్థం జనతా ట్రస్ట్ మిత్ర బృందం అండగా నిలిచింది. గ్రంథాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ట్రస్ట్ ప్రతినిధులు, వారికి అవసరమైన టేబుల్స్, కుర్చీలు, వాటర్ డిస్పెన్సర్‌ను శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఈ సాయం చేసినట్లు తెలిపారు. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా జనతా ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్, నకిరెడ్డి మహేందర్, ఐనవోలు శివరాంలతో పాటు గూడూరు సందీప్, రంజిత్, అంబేద్కర్, దయాకర్, విఘ్నేష్, విజయ్ సింగ్, నాగేంద్ర బాబు, రవీంద్ర చారి, రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి :నలుగురు అరెస్ట్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు, రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
సెల్ ఫోన్ కోసం హత్య.. నిందితుడిని రిమాండ్ కి తరలింపు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సెల్ ఫోన్ కోసం తోటి కూలీనే హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకొని శనివారం అరెస్ట్ చేసే రిమాండ్ కి తరలించినట్టు కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకి వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు కోసం తోటి కూలీని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. గత ఫిబ్రవరి 12న రాత్రి సమయంలో, కామారెడ్డి బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ విషయం పై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అర్ని తలోక్ జిల్లా పంగిడి కి చెందిన నిందితుడు ఆకాష్ నాగురావ్ కోవె బాధితుడైన శ్రీనివాస్ (కూలీ) ముఖం, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేసి, కింద పడేసి చంపాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.300 నగదును దోచుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ విషయం పై బస్టాండ్ కంట్రోలర్ షెర్ల సత్య గౌడ్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు.









