Home Blog Page 132

మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ దేవాలయం

0
  1. జై జై శ్రీమన్నారాయణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;

శ్రీలక్ష్మీనారాయణ !
లీలాయుత భక్తలోల ! ప్రియ పరిపాలా !
త్రైలోక్యధామ ! రక్షక !
పాలించగ దయను జూపు పావన చరితా !

jaind temple image
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది అతి ప్రాచీన మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అష్ట కోణాకృతిలో జైనులు నిర్మించారు. నల్ల రాయితో నిర్మించిన ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్టు ఏకశిలతో తయారు చేశారు. ఆలయ నిర్మాణశైలి, అద్భుత కళా సంపద చూపరులను ఆకట్టుకుంటుంది.

ఆలయ ప్రత్యేకత

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఏడాదికి రెండుసార్లు స్వామివారి పాదాలను సూర్య భగవానుని కిరణాలు తాకుతుండడం ఈ ఆలయ ప్రత్యేకత. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకినప్పుడు స్వామి విగ్రహం బంగారు వర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. నల్ల రాతితో కట్టిన అద్భుత కట్టడాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

Jainad temple laxmi narayana

ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీమన్నారాయణుని బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మొదలవుతాయి. ద్వాదశి రోజున కల్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక బహుళ పంచమి రోజున స్వామి వారి రథోత్సవం అశేష జన వాహిని నడుమ కనుల పండువగా సాగుతుంది. ఈ రథోత్సవం తిలకించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

ఆకట్టుకుంటున్న విగ్రహాలు

ఆలయంలో ఆది దేవుడు గణపతితో పాటు చెన్నకేశవ స్వామి, పద్మనాభ స్వామి, గరుత్మంతుడు, హయగ్రీవ స్వామి విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. పక్కన శివాలయం ఉంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు జైనుల నాటి కళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ప్రతిరోజూ భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

jainad laxminarayana swamy

జైనథ్ ఇలవేల్పు శ్రీమన్నారాయణుడు

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిగాను, సకల శుభాలను కలుగజేసే శ్రీమన్నారాయణుడి గాను, సంతాన భాగ్యం కలుగజేసే
సత్యనారాయణ స్వామిగాను ఆ దేవ దేవుని భక్తులు కొలుస్తారు. అయిదు పున్నములు వచ్చేలా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కళ్యాణోత్సవం రోజు సాయంత్రం అర్చకులు గరుడ ముద్ద అందజేస్తారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

jainad temple

ఇలా వెళ్ళవచ్చు

ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది జైనథ్ ఆలయం. ఈ ఆలయం చేరుకోవడానికి అరగంటకో బస్సు ఉంటుంది. జైనథ్ బేల, గడ్ చందూర్, చంద్రపూర్ బస్సులు వెళుతుంటాయి. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.