చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఘనంగా రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేల మండల మరాఠా సంఘం అధ్యక్షుడు విఠల్ రావుత్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం జనవరి 12న రాజమాత జిజౌ జయంతిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశం వీరమాతలకు పేరుగొన్నది అని అటువంటి వారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి వీరమాత జిజియాబాయి అని అన్నారు. మరాఠా యోధుల కుటుంబంలో పుట్టిన ఆమె హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేశారని అన్నారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు అని అన్నారు.వివేకానంద బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉత్తేజ పరుస్తునే ఉన్నాయని పేర్కొన్నారు. నేటి యువత వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ లకు చెందిన ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

