బోథ్ లో గొర్రెల మందపై కుక్కల దాడి_ 20 గొర్రెలు మృతి
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. బోథ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్న ఏకులారి పోతన్నకు చెందిన దాదాపు 80 మేకలు, గొర్రెలను తన ఇంటి వద్ద ఉన్న మేకల కొట్టంలో ఉంచాడు. అయితే బుధవారం అర్ధరాత్రి మేకల కొట్టంలో ఉన్న గొర్రెల మంద పై కుక్కలు దాడి చేయడంతో దాదాపు 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అంతేగాకుండా 10 చిన్న మేక పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఉండడంతో మేకల యజమానితో పాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.

