అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆత్మవిశ్వాసం, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని బాసర ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ అలిసెరి గోవర్ధన్ అన్నారు. ఆయన వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున ఆయన్ను మర్యాదపూర్వకముగా కలిసి చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్లెంగ ముత్యం మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఆర్జేయూకేటీ లో జరుగుతున్న మంచి మార్పులను, అంకిత భావంతో పనిచేస్తున్న విధానాన్ని గురించి కొనియాడారు. విద్యార్థుల అభివృద్ధి కోసం, వారికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం కోసం ముందుండి పనిచేసిన అనేక ఉదాహరణలను గురించి వివరించారు. వైస్ ఛాన్సలర్ గెస్ట్ ఫాకల్టీ ల కోసం చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ గోవర్ధన్ మాట్లాడుతూ..ఫ్యాకల్టీలకు అనేక సూచనలు చేశారు. అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలని, దానితోపాటు మన స్థాయిని కూడా పెంచుకొని మంచి ఫ్యాకల్టీగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఫ్యాకల్టీలు తమ యొక్క బోధన స్థాయిలను రకరకాల కార్యక్రమాల ద్వారా పెంచుకొని విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ సభ్యులు బైరు రాజేష్, కోటగిరి కృష్ణ, బి.సురేష్, బాదావత్ నవీన్, శ్రీధర్,రాజు, సోఫియా, వీణ, హారిక తదితరులు పాల్గొన్నారు.

