Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

తెలంగాణ స్థానిక ఎన్నికలు నిలుపుదలకు ఛాన్స్..?

లక్ష్మణరేఖ దాటిన బీసీ రిజర్వేషన్లు

సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!

చిత్రం న్యూస్, నిర్మల్; తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 న్యాయపరమైన సంక్షోభానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న ఈ అంశంపై ఏకంగా సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులలో ఏకకాలంలో విచారణ జరగనుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ న్యాయ పోరాటానికి కేంద్ర బిందువు, సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఈ కొత్త జీవో ఉల్లంఘిస్తుందనే ప్రధాన అభ్యంతరం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు, 42% బీసీ రిజర్వేషన్లు కలిపితే, మొత్తం రిజర్వేషన్ల శాతం 50% పైగా పెరుగుతుందని పిటిషనర్లు గట్టిగా వాదిస్తున్నారు. రిజర్వేషన్ల చరిత్రలో అత్యంత కీలకమైన ‘ఇందిరా సాహ్నీ’ తీర్పు ఆధారంగానే పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రత్యేక పరిస్థితులు మినహా, రిజర్వేషన్లు ఏమాత్రం 50 శాతాన్ని మించకూడదని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఈ జీవో ఆ రాజ్యాంగ పరిమితిని స్పష్టంగా దాటుతుందని పేర్కొంటూ, దీనిని తక్షణమే రద్దు చేయాలని గోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ కింద  (అక్టోబర్ 6, 2025) సుప్రీంకోర్టు విచారించనుంది. అత్యున్నత న్యాయస్థానం ఈ జీవోకు పచ్చజెండా ఊపుతుందా.. లేక 50 శాతం పరిమితిని దృష్టిలో ఉంచుకుని బ్రేకులు వేస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశంపై చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధమవుతున్నప్పటికీ, ఇదే బీసీ రిజర్వేషన్ల అంశంపై మాధవరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఈ కేసును అక్టోబర్ 8న విచారించనుంది. ఒకే కీలక అంశంపై రెండు  ఉన్నత న్యాయస్థానాలు వరుసగా విచారణ జరపనుండడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను పెంచింది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన తరుణంలో కోర్టు తీర్పు ప్రభావం బహుముఖంగా ఉండనుంది. ఒకవేళ కోర్టులు జీవోను నిలుపుదల చేసినా లేదా సవరింపునకు ఆదేశించినా స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే లేదా వాయిదా పడే అవకాశం ఉంది. రిజర్వేషన్లను తిరిగి లెక్కించడం, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవరించడం వంటి అనివార్య చర్యల కారణంగా అభ్యర్థులు, ఆశావహులలో గందరగోళం నెలకొంటుంది. ఇది ఎన్నికల భవిష్యత్తును, రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

*బీసీ సంఘాల ఆశ- ప్రాతినిధ్యం నిలుస్తుందా?

ఈ మొత్తం వ్యవహారంలో బీసీ సంఘాలు, నాయకుల ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంది. ఎక్కువ శాతం రిజర్వేషన్ల ద్వారా తమ వర్గానికి మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని వారు ఆశిస్తున్నారు. గతంలో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నందున, స్థానిక సంస్థల్లో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం దక్కలేదనేది వారి ప్రధాన వాదన. 42% రిజర్వేషన్ల నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఒకవేళ కోర్టులు 42% రిజర్వేషన్లను తగ్గిస్తే..స్థానిక సంస్థలలో బీసీలకు దక్కే సీట్లు తగ్గుతాయి. దీంతో బీసీల ఓటు బ్యాంకు వారి రాజకీయ ప్రాధాన్యతపై ప్రభావం పడుతుందనే భయం ఉంది. మరోవైపు ఈ అంశం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కోర్టు పరిధిలోకి రావడంతో దీనిపై ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఎన్నికల నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలితే ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం లభించినట్టే అవుతుంది.

*రాజకీయ వ్యూహంపై ప్రభావం-అభ్యర్థుల్లో అనిశ్చితి

ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం అనేది రాజకీయంగా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా బీసీ వర్గాల మద్దతును పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవాలని పాలక పక్షం భావించింది. అయితే.. న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో బీసీ అభ్యర్థులు,  ఆశావహుల్లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే.. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడాలనే వారి ఆశలు కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి. రిజర్వేషన్లు తగ్గినట్లయితే ఇప్పటికే ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్న అనేకమంది అభ్యర్థులు తమ పోటీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల రాజకీయం, న్యాయస్థానాల పాత్రను మరోసారి చర్చనీయాంశం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న సుప్రీంకోర్టు విచారణ, తెలంగాణ రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ల అంశానికి కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది, ఇది రాబోయే ఎన్నికల ప్రక్రియకు, నూతన అధ్యాయానికి దిశానిర్దేశం చేయనుంది.

వెంకగారి భూమయ్య (సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments