సోలార్ ఫెన్సింగ్ కు కాలు తగిలి ఒకరి మృతి
_దసరా పండగ రోజు విషాదం
చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన ఏలేటి నారాయణరెడ్డి గురువారం పంటకు అమర్చిన సోలార్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి రెండు సంవత్సరాల నుండి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే వ్యవసాయ భూమిలో కోతుల బెడద నుంచి పంటను రక్షించడానికి సోలార్ ఫెన్సింగ్‌ను చేను చుట్టూ అమర్చాడు. గురువారం ఉదయం కోతులు చేనులోకి వచ్చాయన్న సమాచారం రావడంతో చేనులోకి వెళ్లి కోతులను తరిమే క్రమంలో పంటకు అమర్చబడి ఉన్న సోలార్ వైర్‌ను చూసుకోకపోవడంతో వైర్లకు కాలు తట్టుకొని సోలార్ షాక్ తగిలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

