ఉగ్రరూపం దాల్చిన బాసర గోదావరి
*లోతట్టు ప్రాంతాలు జలమయం
*ఇబ్బందుల్లో భక్తులు, స్థానికులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా బాసర వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గురువారం గంట గంటకూ ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాసర ఆలయం నుంచి గోదావరి పుష్కర ఘాటు కు వెళ్లే రోడ్డు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా 16 రోజులుగా బాసర, ఓని, కీర్గుల్ (కె), కౌట, సాలాపూర్, సవర్గం.గ్రామాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూరగాయల మార్కెట్ వెళ్లాలన్న, బ్యాంకుకు వెళ్లాలన్న వెళ్ళలేని పరిస్థితి. ఐదు గ్రామ ప్రజలు ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ పరిహారం అందలేదు.

