కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ పాటలతో, మహిళలు డీజే చప్పుళ్ల నడుమ హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ సోమవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రకృతిలో సూర్య చంద్రులను కొలిచిన విధంగా వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్కరంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొనియాడారు. ఊరు వాడ కలిసి సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం, మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ పెద్దల నాటి సాంప్రదాయంతో వచ్చిన పండగని ఘనంగా జరుపుకుంటున్నారు. కీర్గుల్ (కె) గ్రామంలో మొట్ట మొదటిసారిగా దుర్గామాతను గ్రామస్తులు కలిసికట్టుగా ప్రతిష్టించారు. దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

