శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం శాసనసభ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలంతా కష్టాల్లో ఉంటే శాసనసభలో నష్టం పై చర్చించకుండా ఇతర బిల్లులపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. ముథోల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వరద వచ్చిందని, బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గోదావరి నది ఉగ్రరూపంతో నిండా మునిగిందన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలకు పైగా నదీ పరివాహక ప్రాంతాలేనని, రైతాంగానికి ఎన్నడు లేనంత నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిందని రైతులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి, రైతులకు పరిహారం ఇచ్చే విషయమై ప్రకటించాల్సిందిగా కోరారు. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.