వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్
చిత్రం న్యూస్, భీంపూర్: స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే మండలంలో వాట్సప్ వేదికగా ఆయా పార్టీల యువకులు మాటల యుద్ధం మొదలుపెట్టారు . ప్రధాన సమస్య మారిన రోడ్డు అంశంపై వాడి వేడిగా చర్చకు తెరలేపారు. పదేళ్ళు అధికారంలో ఉండి రోడ్డు బాగు చేయించలేదని ఓ పార్టీ నాయకులు విమర్శిస్తే అధికారంలో ఉన్న మీరు చేయొచ్చుగా అని మరికొందరు వాదనకు దిగడం పొలిటికల్ వేడినీ పుట్టిస్తోంది. రాబోవు ఎన్నికల్లో రోడ్డు అంశమే ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుంది. ఇదే అదనుగా యువకులు, విద్యావంతులు కొందరు అప్పుడే పరామర్శలు, ప్రచారంతో ఊపుతెస్తున్నారు. మండల వాసులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్య నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో రానుందని, రిజర్వేషన్ తమకే అనుకూలంగా వస్తుందని మద్దతు తెలపాలని తమ చర్యలతో పరోక్షంగా తాము రంగంలో ఉన్నామని హల్ చల్ చేయడం పొలిటికల్ వార్ ని తలపిస్తోంది.