*డా.ముత్యం రెడ్డి తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం
చిత్రం న్యూస్,భైంసా: తన తల్లి అమృతాబాయి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువుల రాకపోకల్లో ఆలస్యం కలిగిన సందర్భాల్లో మృతదేహాన్ని భద్రపరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడనుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..తల్లి ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆశయంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సేవను ప్రారంభించాం. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫ్రీజర్ సేవలు అవసరమున్న వారు 9441375375, 6300854960 మొబైల్ నెంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన డా. ముత్యంరెడ్డిని భైంసా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కదం మోహన్ రావ్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చందులాల్, బీజేపీ పట్టణ కమిటి అధ్యక్షులు రావుల రాము, మాజీ అధ్యక్షులు గాలి రవితో పాటు పలువురు అభినందించారు.