*భైంసా లోని ఆనంద్ నగర్ లో విషాద ఘటన
చిత్రం న్యూస్, భైంసా: ఫోన్ లో పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆనంద నగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాదు మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్- సాయిప్రజ దంపతులు గత కొంతకాలంగా బైంసా లోని ఆనంద్ నగర్ కాలనీలోని నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిషేంద్ర (13) హైదరాబాదులో బాష్యం స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని పదవ తరగతి లో చేరాల్సి ఉండగా కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిస అయ్యాడు. పదో తరగతి కోసం పాఠశాలలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి పోయాడు. మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టేందుకు చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజులుగా కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన విద్యార్థి బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి కి తరలించారు.