బైక్ పై తిరుగుతూ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులు అధైర్యపడవద్దని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అటు అధికారులు సైతం గుంట భూమిని కూడా వదలకుండా నష్టపోయిన ప్రతి భూమిలో సర్వేలు నిర్వహించి, త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తృతంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం జైనథ్ మండలంలోని పెండల్వాడ, బాలపూర్, సాంగ్వి, కౌఠ తదితర పెన్ గంగా నది పరివాహక గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులను వెంటబెట్టుకొని పర్యటించారు. ఈ సందర్భంగా స్వయంగా తానే బైక్ నడుపుతూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు.
అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..భారీ వర్షాలతో దాదాపు 20 నుండి 22 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. ప్రస్తుతం రైతుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, రైతులెవ్వరు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతులు సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పులు బ్యాంకు రుణాలను వెసులుబాటు చేయాల లేదా రీ షెడ్యూల్ చేయాలా అనే అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, బీజేపీ నాయకులు లోక కరుణాకర్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విజయ్, ఉల్లాస్ రెడ్డి, నరేష్, రాందాస్, రమేష్, శ్రీకాంత్, రాకేష్, వైభవ్, సంతోష్, సూర్యరెడ్డి తదితరులు ఉన్నారు.