యువతకు వాలీబాల్ కిట్ ను అందజేస్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
*విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి
*యువత గంజాయి, పేకాట, మట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి
*కోరట, గిమ్మ, తరోడ గ్రామాల ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమం
*మూడు గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత
చిత్రం న్యూస్, భోరజ్: సరిహద్దు గ్రామాల ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు లోని చనాక కోరాట ప్రాజెక్టును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి నది ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు. అదేవిధంగా పెన్ గంగా బ్రిడ్జి వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించి యువత ఈతకు రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గం వైపు పయనించేలా కొరాట, గిమ్మ, తర్నం మూడు గ్రామాల ప్రజలు యువతతో పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా చైతన్య పరిచారు. జిల్లాలో భారీ వర్షాలు దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, బ్రిడ్జిల పైనుండి వరదలు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటకుండా ఉండాలని, అత్యంత వర్షం పడినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకుండా ఉండాలని సూచించారు.
గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా మహారాష్ట్ర తో సరిహద్దుతో ఉన్నందున అక్రమంగా దేశీదారు తరలించకుండా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రజలు జిల్లా పోలీసు యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. గ్రామాలలో వీడీసీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని, విడిసి ల ద్వారా ఎలాంటి అక్రమ పరిస్థితులు నెలకొన్న దానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. అలాగే యువతకు విద్యార్థులకు చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాలలో గంజాయిని పండించకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతూ ప్రభుత్వ పథకాలు వర్తించకుండా ఉంటాయని గమనించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా యువత విద్యార్థులు జలపాతాలు, నదులు వాగులు వంటి వాటి వద్ద జాగ్రత్తలు వహించాలని, ఈతరానివారు వాటి వద్దకు వెళ్ళకుండా ఉండాలని తెలిపారు. లోతట్టు బ్రిడ్జిల పైనుండి నీటి ప్రవాహం జరిగినప్పుడు వాటిని దాటకుండా ఉండాలని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా అభివృద్ధి చెందాలని మూడు గ్రామాల ప్రజలకు యువతకు మూడు వాలీబాల్ స్పోర్ట్స్ కిట్స్ అందజేసి ప్రోత్సహించారు. చెడు వ్యసనాల బారినపడిన యువతకు ప్రత్యేకంగా డౌ సెంటర్ల ద్వారా చికిత్స అందించి నయం చేకూర్చవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఎస్సై గౌతమ్, మూడు గ్రామాల ప్రజలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

