విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు
చిత్రం న్యూస్, బేల: విచారణ అనంతరం హాకా సెంటర్ పై చర్యలు తీసుకుంటామని ఏడీ శ్రీధర్ అన్నారు. బేల మండలంలో హాకా సెంటర్ నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు పట్టుకోవడంతో వ్యవసాయ అధికారులు అప్రమత్తం అయి సదరు వ్యక్తి పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏడి శ్రీధర్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న యూరియా ను రైతులు పట్టుకోవడంతో వెంటనే వ్యవసాయ అధికారులను పంపించడం జరిగిందని అన్నారు. విచారణ చేపట్టి హాకా సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. హాకా సెంటర్లో 440 యూరియా బస్తాలు ఉన్నాయని, మిగితా 200 యూరియా బస్తాలు అక్రమంగా మహారాష్ట్ర కు తరలించారని అన్నారు. ఇందులో రెండు బండ్లు వంద చొప్పున యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారని సిర్సన్న రైతులు ఒక బండిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారన్నారు. రెండవ బండి దహెగావ్ గ్రామంలోని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు నిక్కం దత్త ఇంటి సమీపంలో లోడ్ చేశారు. దీని పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

