బోథ్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులు పరిశీలించిన ఆయన సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం లో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి సదరు గుత్తేదారుతో మాట్లాడి తొందరగా పనులు పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ల్యాబ్ ను సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ల్యాబ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయ పాలన పాటించాలని మూడు షిఫ్ట్ లుగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ విధానం అమర్చాలని సూచించారు. అంతే కాకుండా ఇంకా నూతన ల్యాబ్,బ్లడ్ బ్యాంకు సౌకర్యం కోసం, ఇతర సౌకర్యాలు కల్పన కోసం రూ.7కోట్లు నిధులు కేటాయించామని వాటికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని అన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఉండే ప్రాంతం కావున వైద్యులు అప్రమత్తం గా ఉండాలని,మరియు వార్డులో బయట సీసీ కెమెరాలు అమర్చాలని స్థానిక ఎస్ఐకి సూచించారు. ఈ కార్యక్రమం లో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్,కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తదితరులు పాల్గొన్నారు.

