ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహించండి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, బోథ్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఉద్యమంలా చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయితీ, డీఆర్డీఏ, ఐకేపీ అధికారులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలకు కళాశాలకు కావలసిన మొక్కలన్నింటిని సరఫరా చేయవలసిందిగా సంబంధ అధికారులకు ఆదేశించి, కళాశాల ఆవరణలో పెంచుతున్న కిచెన్ గార్డెన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, కిచెన్ గార్డెన్ పెంపకం వల్ల విద్యార్థులకు వ్యవసాయ సామర్థ్యాలు మెరుగుపడతాయని భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్, కళాశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల తహసీల్దార్ సుభాష్ చందర్, మండల అభివృద్ధి అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రవితేజ, ఎఫ్ఆర్వో ప్రణయ్, ఐకేపీ ఏపీఎం మాధవ్, డీఆర్డీఏ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

