*సీపీఐ పెద్దాపురం పట్టణ మహాసభలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
చిత్రం న్యూస్, పెద్దాపురం: అల్లూరిని వారసత్వంగా తీసుకొని సమాజ రుగ్మతలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు . శుక్రవారం ఉదయం స్థానిక పెద్దాపురం హమాలి యూనియన్ కార్యాలయంలో పెద్దాపురం 18వ పట్టణ మహాసభ వై. రామకృష్ణ అధ్యక్షతన జరిగింది అంతకుముందు మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తాటిపాక మధుతో పాటు జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, పి సత్యనారాయణ లు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ మహాసభ సందర్భంగా పెద్దాపురం మరిడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ..దేశంలో బ్రిటిష్ వలసపాలన అంతానికి దేశ స్వాతంత్ర్య సముపార్జనకు మొక్కవోని దీక్షతో ఎనలేని ధైర్యసాహసాలతో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. చింతపల్లి, నర్శీపట్టణం,విశాఖ మన్యం ప్రాంతాల్లో అమాయక గిరిజనులను దోచుకుంటున్న బ్రిటీష్ అధికారుల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరచి వారికి యుద్ధ విద్యలు నేర్పించి గెరిల్లా యుద్ధపద్ధతుల్లో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన విప్లవయోధుడు అల్లూరి అన్నారు. బ్రిటిష్ పాలన అంతం కావాలని తదనంతరం దేశంలో పేదరికం, దారిద్య్రం,దోపిడీ, అసమానతలు లేని స్వపరిపాలన కాంక్షతో 27 ఏళ్ళ వయస్సులోనే తన ప్రాణాలను బ్రిటిష్ తుపాకీ గుళ్ళకు అర్పించారన్నారు. అల్లూరి ఆశించిన సమాజ స్థాపనకు పూనుకోవడమే మనం అల్లూరికి అర్పించే నిజమైన నివాళి అని ఆయన ఆశయాలకు నేటి యువత ముందుకురావాలని మధుపిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి కే. బోడకొండ మాట్లాడుతూ.. ఈనెల ఐదున జరిగే సీపీఐ రాష్ట్రవ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు .సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈనెల 16, 17 తేదీలలో సామర్లకోటలో జరిగే కాకినాడ జిల్లా జిల్లా మహాసభలను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరo పెద్దాపురం పట్టణ కార్యదర్శిగా వై రామకృష్ణ తో పాటు మరో 7 గురు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఈ సమావేశములో పార్టీ నాయకులు త్రిమూర్తులు, వెంకట్రావు తదితరులు ప్రసంగించారు