బేలలో ఉద్రిక్తత
చిత్రం న్యూస్, బేల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బేల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాంఖడే రూప్ రావ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకోవాలని వాంఖడే రూప్ రావ్ సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
