పేదోడి కల సాకారం దిశగా కాంగ్రెస్ పాలన: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఎల్లమ్మకుంట లో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభోత్సవం..పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగులు చేపడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కాంటా వద్ద ప్రత్యేక పూజలు చేసి కొనుగోలును ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు బంజారా సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అటు గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న సునీత- సుధాకర్ గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలని చేతులెత్తేస్తే రాష్ట్రం రైతు పక్షపాతిగా వ్యవహరించి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొత్తం 739 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేపడుతుండగా, అందులో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఐకేపీ వారికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చుక్క నీరందించిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ.. పేదోళ్ల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ మొప్ యాదగిరి , సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఉమ్మాజి నరేష్, ప్రతాప్ సింగ్, రాంచందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల, తదితరులు పాల్గొన్నారు.




