ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం , ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాదు టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనీ శాస్త్రి నగర్ గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనడపడం , డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం , ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి , తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు.
కొవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025లో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని మర్డర్ల తో 40 మంది చనిపోయారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి మరణాలు జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని, కృషి అనేది ప్రతి గ్రామము నుండి మొదలవ్వాలని గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు శాస్త్రి నగర్ గ్రామం నుండి ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించినట్లు అయితే ఇట్టి గ్రామము నుండి ద్విచక్ర వాహనదారులను ఐపీల్ మ్యాచ్ తిలకించడానికి ఉచితంగా పంపివ్వడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు మరియు పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , నిజామాబాద్ సౌత్ రూరల్ సురేష్ కుమార్ , ట్రాఫిక్ సీఐ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్ , జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిరణ్ కుమార్ ఎస్సై డి శ్రీకాంత్ , గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

