బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్రం న్యూస్, బాసర : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం మజ్జిగ, చల్లటి నీరు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు . భక్తులకు సుమారు రెండు గంటల సమయం దర్శనానికి పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయరామరావు, బాసర సీఐ కిరణ్, పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.

