చిత్రం న్యూస్,నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
మండల స్థాయి సభలను విజయవంతం చేయాలి : కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని, అదే స్పూర్తితో మండల స్థాయి సభలను కూడా సమర్ధవంతంగా జరిగేలా చూడాలన్నారు. మండల సభ నిర్వహణ సమయానికి ముందే ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్ లు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో అందిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. , జనాభా గణన అన్ని మున్సిపల్ పట్టణాలు, మండలాలు, క్షేత్రస్థాయిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజువారీగా ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్లను, ఆర్డీఓను ఆదేశించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియకు విద్యాశాఖ పూర్తి సహకారం అందించేలా చూడాలని, ఈ విషయంలో ఎవరైనా నిరాకరిస్తే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలను విరివిగా సందర్శిస్తూ, విద్యార్థులు వసతి, సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


