చిత్రం న్యూస్, భోరజ్:ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ గ్రామ రైతుల మూడు దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ల్యాండ్ భూసేకరణ పరిహారం డబ్బులు ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక చొరవ, నిరంతర కృషి ఫలితంగా దాదాపు 89 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయి.
30 ఏళ్ల పోరాటం: రైల్వే లైన్ నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి గిమ్మ రైతులు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వాల కాలంలో పరిష్కారం కాని ఈ సమస్య, పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొలిక్కి వచ్చింది.
ఎమ్మెల్యే చొరవ: ఈ అంశంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి, నిధుల విడుదలకు అవసరమైన అడ్డంకులను తొలగించారు. ఫలితంగా రూ.89 లక్షల పరిహారం నేరుగా బాధితుల అకౌంట్లలో జమ అయ్యాయి.
కృతజ్ఞతలు తెలిపిన రైతులు: తమకు న్యాయం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గిమ్మ గ్రామ రైతులు ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. అక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సర్పంచ్ గాజుల సన్నీ,బీజేపి నాయకులు ,రైతులు పాల్గొన్నారు.

