చిత్రం న్యూస్, న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆధార్ సేవల కోసం ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పూర్తి స్థాయిలో ఆధునీకరించిన కొత్త ‘ఆధార్’ (Aadhaar) మొబైల్ యాప్‌ను బుధవారం (జనవరి 28) నాడు విడుదల చేసింది. ఢిల్లీలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు.
ముఖ్య ఫీచర్లు ఇవే:
మొబైల్ నంబర్ అప్‌డేట్: గత పదేళ్లుగా మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
అడ్రస్ మార్పు: చిరునామా మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, ఫేస్ అథెంటికేషన్ (Face Authentication) ద్వారా నేరుగా ఫోన్ నుంచే మార్చుకునే వెసులుబాటు కల్పించారు.
డిజిటల్ ప్రొఫైల్స్: ఒకే యాప్‌లో కుటుంబంలోని ఐదుగురు సభ్యుల ఆధార్ ప్రొఫైల్‌లను సేవ్ చేసుకోవచ్చు.
ప్రైవసీ అండ్ సెక్యూరిటీ: మీ ఆధార్ నంబర్ లేదా పూర్తి వివరాలు బయటకు తెలియకుండా ఉండేలా ‘మాస్క్డ్ ఆధార్’ మరియు సెలెక్టివ్ డేటా షేరింగ్ ఆప్షన్లను ఇందులో చేర్చారు.
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్: ఇంటర్నెట్ లేకపోయినా QR కోడ్ ద్వారా గుర్తింపును వెరిఫై చేసుకోవచ్చు.
ఎక్కడ లభిస్తుంది: ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Google Play Store) మరియు iOS (Apple App Store) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. పాత ‘mAadhaar’ యాప్ స్థానంలో ఈ సరికొత్త వెర్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా భౌతిక ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు.

