చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బీజేపీకి ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను సైతం మేము చేసి చూపిస్తున్నాం” అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణం నుంచి కచ్‌కంటి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న స్లాటర్ హౌస్ (కబేళా)ను మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఆయన దగ్గరుండి తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దశాబ్దాల సమస్యకు విముక్తి: గత 30 ఏళ్లుగా ఈ స్లాటర్ హౌస్ నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానిక ప్రజలు నరకయాతన అనుభవించారని, దీనిపై గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మున్సిపల్ చైర్మన్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాట నిలబెట్టుకున్న బీజేపీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టామని తెలిపారు.రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు పట్టణంలో తోపుడు బండ్ల క్రమబద్ధీకరణ వంటి పనులు బీజేపీ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ స్లాటర్ హౌస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్న, కృష్ణ, మున్సిపల్ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
