చిత్రం న్యూస్, జైనథ్: చారిత్రక ప్రసిద్ధి గాంచిన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పునరుద్ఘాటించారు. ఆలయంతో పాటు కోనేరు అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు మంజూరైన నేపథ్యంలో శనివారం గ్రామస్తులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను, కోనేరు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో పని చేస్తున్నానని తెలిపారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు ప్రతి అభివృద్ధి పనిని ప్రతికూలంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇతరులను విమర్శిస్తేనే రాజకీయాల్లో హీరోలు అవుతామని కొందరు భ్రమపడుతున్నారని, అటువంటి రాజకీయాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని హితవు పలికారు. ప్రస్తుతం మంజూరైన రూ.1.50 కోట్లతో ఆలయ రూపురేఖలు మార్చడంతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.