చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో భాగంగా అర్హులైనప్పటికీ జీరో (0) బిల్లు రాని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద జీరో (0) కరెంట్ బిల్లు రాని వారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. జీరో బిల్లు రాని అర్హులైన వినియోగదారులు తమ మండలంలోని MPDO కార్యాలయం వద్దకు లేదా మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ నివాసితులై ఉండి, తెల్ల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) కలిగి, వారి ఆధార్ నంబర్ విద్యుత్ కనెక్షన్ కస్టమర్ IDతో లింక్ అయి ఉండాలి. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉన్న గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కావలసిన పత్రాలు:కరెంట్ బిల్లు, చివరిగా చెల్లించిన బిల్లు రసీదు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అన్ని అర్హతలు ఉండి కూడా బిల్లు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సవరించిన బిల్లు (జీరో బిల్లు) జారీ చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అర్హులైన వినియోగదారులు జీరో బిల్లును పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
