* చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కేంద్రం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చైనా మాంజా దారం వినియోగిస్తే కలిగే నష్టాలపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేటర్.డా అమృత్ కుమార్, చేయూత ఫౌండేషన్ ఛైర్మన్ డా.యన్.టి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డా.యన్.టి. రమణ మాట్లాడుతూ..పండగల సమయంలో గాలి పటాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న చైనా మాంజా దారం ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని, చైనా మాంజా దారంలో గ్లాస్ పౌడర్, నైలాన్ దారం వంటివి ఉపయోగించడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. పక్షులు, జంతువులు మృతి చెందుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, యువత, ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లుతున్నారని, ప్రత్యేకంగా రోడ్లపై వేగంగా ప్రయాణించే వాహనదారుల మెడ, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు కలుగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చైనా మాంజా తయారీ, విక్రయాలు, వినియోగం నిషేధించాలన్నారు. స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డా.అమృత్ కుమార్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు పిల్లలను చైనా మాంజాకు దూరంగా ఉంచాలన్నారు. పర్యావరణ హితమైన కాటన్ మాంజా మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ సంస్థలు & చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల నేరడిగొండ ప్రధానోపాధ్యాయురాలు, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు మీనా, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
