చిత్రం న్యూస్, జైనథ్: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ముందుస్తు జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలుపుతూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తోందన్నారు. లైట్ మోటార్ వెహికల్ నడిపే వాహనదారులు డ్రైవింగ్ సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలన్నారు. సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడవద్దని పిల్లలు తమ తల్లి తండ్రులకు చెప్పాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలె,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
