Chitram news
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 1:59 pm Editor : Chitram news

గ్యాస్ వినియోగదారులు ఇక ఈ-కేవైసీ చెయ్యాల్సిందే!

చిత్రం న్యూస్, హైదరాబాద్: గ్యాస్ వినియోగదారులు తమ ఈ కేవైసీ (e KYC) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గ్యాస్ ఏజన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని నేరుగా అర్హులైన వారికే అందించడం, నకిలీ కనెక్షన్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతాలో పడే రాయితీ డబ్బులు నిలిచిపోవడంతో పాటు సిలిండర్ బుకింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధారణ కనెక్షన్ ఉన్నవారు..ఉజ్వల పథకం లబ్ధిదారులు ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. గ్యాస్ డెలివరీ ఇచ్చే వ్యక్తి వద్ద బయోమెట్రిక్ ద్వారా లేదా నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా సులభంగా కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. చాలా చోట్ల ఒకే పేరు మీద లేదా ఒకే ఇంట్లో అనర్హులు కూడా సబ్సిడీ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి నకిలీ కనెక్షన్లను ఏరివేసి.. కేవలం అర్హులైన పేదలకు మాత్రమే సబ్సిడీ అందించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రతి కస్టమర్ తమ ఆధార్ కార్డు వివరాలను గ్యాస్ కనెక్షన్‌తో సరిచూసుకోవాల్సి ఉంటుందని లోకల్ గ్యాస్ ఏజన్సీలు పేర్కొంటున్నాయి.