చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గత నలభై ఐదు రోజుల వరకు సోయా పంటను అమ్మడానికి మార్కెట్ యార్డ్ లో వేచి ఉన్న రైతులకు చివరికి ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలియజేయడంతో సోమవారం రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు. మార్కెట్ సిబ్బంది రైతుల సోయా పంటను బార్ కోడ్ వారీగా తూకం చేసి వాపస్ ఇచ్చేస్తున్నారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ మోకాళ్ళ పైన కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీస్ సిబ్బంది ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే వారి జీతభత్యాలను పెంచుతారు కానీ రైతులు పండించిన పంటకు మద్దత్తు ధర కల్పించండి అంటే మాత్రం ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అప్పులు తీర్చడం కోసం, అదేవిధంగా ఇప్పుడు పంట పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అవసరం ఉండడంతో తమ పంటను ప్రైవేట్ కు విక్రయించాల్సిన సమయం వచ్చిందని పంటను ఇంటికి తీసుకెళుతున్నామన్నారు.

